భారీ వర్షాలపై రామగుండం పోలీసుల హై అలర్ట్

Spread the love

భారీ వర్షాలపై పోలీసుల హెచ్చరిక
ముంపు ప్రాంతాలను పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి…

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచన…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలాల్లో ప్రవహిస్తున్న వరద నీరు రహదారులపైకి చేరిన ప్రాంతాలను పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి మల్కాపూర్, ప్రభుత్వ వైద్య కళాశాల, 5 ఇంక్లైన్ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సంబంధిత అధికారులు పూర్తి అప్రమత్తతతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లరాదని సూచించారు. వర్షాల కారణంగా రహదారులు జారుడుగా మారే అవకాశం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో, అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని కోరారు.

పిల్లలు, యువకులు నదులు, చెరువుల వద్దకు సెల్ఫీలు దిగడానికి లేదా ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని లేదా సమీపంలోని పోలీసు అధికారులను సంప్రదించాలని డీసీపీ బి. రామ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top