
మైన్ క్లోజర్ నిధులతో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించాలి….
యువతకు నైపుణ్య శిక్షణ.. మహిళలకు ఉపాధి అవకాశాలు.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : మైన్ క్లోజర్ కింద అందుబాటులోకి వచ్చిన నిధులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించి, గనుల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
ఐడీఓసీలో మైన్ క్లోజర్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైన్ క్లోజర్ నిధులతో యువతకు నైపుణ్యాభివృద్ధి, వివిధ వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఎన్‌ఏసీ ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ వంటి ఆధునిక నైపుణ్యాల్లో యువతకు శిక్షణ అందించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా మహిళా సాధికారత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను పెంచాలని సూచించారు.
మైన్ క్లోజర్ నిధులతో పండ్ల, ఔషధ, స్థానిక జాతుల మొక్కల పెంపకం, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి, వృక్షజాలం–జంతుజాల సంరక్షణ, నీటి వనరుల నిర్వహణ, సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, కళలు–సంస్కృతి పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలు, పారిశుధ్య కార్యక్రమాలకు కూడా నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి కార్యక్రమానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
మైన్ క్లోజర్ నిధులతో చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీపీఓ శ్రీమాల, సింగరేణి ఆర్‌జీ-1, ఆర్‌జీ-2, ఆర్‌జీ-3 ప్రతినిధులు, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్, జీ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీధర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
