
హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలేది లేదు….
మూడు సంవత్సరాల పాలనపై బీజేపీ సమరం.. రామగుండంలో ప్రతిరోజూ ప్రశ్నిస్తాం….
— సోమారపు లావణ్య….
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రామగుండం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.
గోదావరిఖని శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీతో కలిసి సోమారపు లావణ్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు, 13 డిక్లరేషన్లను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని, ఇకపై ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు బీజేపీ ప్రభుత్వం వెంటపడుతూనే ఉంటుందని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలు, అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.
“ఇకపై రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రతిరోజూ ప్రశ్నిస్తాం” అని సోమారపు లావణ్య అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం ప్రజల తరఫున పోరాడుతామని ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ఐతే పవన్, మిట్టపల్లి సతీష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, మాజీ ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, మాజీ కార్యదర్శి జక్కుల నరహరి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజన శ్రీ, రజిత, చల్ల శోభారాణి, సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్, మారపెల్లి శ్రీనివాస్, ఎతిరాజ్ సురేష్, బూడిద రమేష్, పంగ రవి, పొట్ల వెంకటేశ్, సిలివేరి అంజి, అరిగెల శ్రావణ్, అంకం తిరుపతి, మెరుగు శ్రీనివాస్, మంధిని మహేశ్, రోడ్డ శివ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
