విద్యార్థుల భద్రతే లక్ష్యం.. షీ టీమ్‌పై అవగాహన….

Spread the love

విద్యార్థుల భద్రతే లక్ష్యం.. షీ టీమ్‌పై అవగాహన….

వాసవ్య హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించిన పెద్దపల్లి షీ టీమ్….

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి షీ టీమ్ బృందం గోదావరిఖని రమేష్‌నగర్‌లోని వాసవ్య హైస్కూల్‌లో విద్యార్థులకు షీ టీమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది.

ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత విద్యార్థులకు మంచి స్పర్శ–చెడు స్పర్శ, యుక్త వయసులో మారే ప్రవర్తన, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం, సామాజిక మాధ్యమాల ప్రభావం, విద్యార్థుల ప్రవర్తనా నియమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, అంతర్జాల మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కూడా విద్యార్థులకు వివరించారు.

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలల పరిసరాల్లో షీ టీమ్ నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మహిళలకు ఏదైనా ప్రమాదం ఎదురైనా, బెదిరింపులకు గురైనా వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలని, అంతర్జాల మోసాలకు గురైతే 1930కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టి-సేఫ్‌ వంటి సురక్షిత ప్రయాణ సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, డైరెక్టర్ విక్రమ్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top