
సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి…
వినాయక చవితి వేళ ఆన్‌లైన్ విరాళాలు, నకిలీ లింకులపై జాగ్రత్త అవసరం….
— డీసీపీ ఎ. భాస్కర్….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం: మంచిర్యాల/ : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ జాగరూకత దినోత్సవంలో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, వన్‌టైమ్ పాస్‌వర్డ్, ఏటీఎం రహస్య సంఖ్య, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని విద్యార్థులకు సూచించారు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్, సందేశాలు, లింకులు, సామాజిక మాధ్యమ ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆన్‌లైన్ విరాళాల పేరుతో మోసాలకు చెక్
రానున్న వినాయక చవితి, గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఆన్‌లైన్ విరాళాల పేరుతో జరిగే మోసాలు, నకిలీ లింకులు, నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ధృవీకరించని వ్యక్తులు లేదా ఖాతాలకు నగదు పంపవద్దని సూచించారు.
అనంతరం ఏసీపీ రంగారెడ్డి డిజిటల్ మోసాలు, పెట్టుబడి మోసాలు, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ నేరాల సహాయవాణికి సమాచారం అందించాలని సూచించారు.
“అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని డీసీపీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, సీసీపీఎస్ ఏసీపీ రంగారెడ్డి, సైబర్ నేరాల సీఐ శ్రీనివాస్, ఆర్‌ఈ సంపత్, ఎస్‌ఐ మధుసూదన్, కళాశాల సిబ్బంది, సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
