
మానవత్వాన్ని చాటుకున్న ప్రెస్ క్లబ్..
నిరుపేద కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ..
సూర్యాపేట జిల్లా/ కోదాడ
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి కోదాడ ప్రెస్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. కోదాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని చెరువు కట్ట బజారులో నివసిస్తున్న ఎండి రహమత్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
వెన్నుపూస సమస్యతో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రహమత్ కుటుంబ యజమాని ఉపాధి కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన విషయాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో ఆ కుటుంబానికి నెల రోజులకు సరిపడా బియ్యం, వంట నూనె, పప్పులు, కారం, ఉప్పు తదితర నిత్యావసర కిరాణా సరుకులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎస్టీఆర్ బాలు, కోదాడ పట్టణంలోని రామాలయం ఆలయ అర్చకులు కాండూరి వంశీకృష్ణ చార్యులు తమవంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రెస్ క్లబ్ పిలుపునకు స్పందించి నిత్యావసర సరుకుల పంపిణీకి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కష్టకాలంలో తమ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచిన ప్రెస్ క్లబ్ సభ్యులు, దాతలకు ఎండి రహమత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహం, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, కోశాధికారి నూరుద్దీన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
