
రామగుండంను ఆదర్శ మునిసిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం…
— మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి రామగుండం, : అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో రామగుండంను ఆదర్శ మునిసిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల వీరోచిత పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలనను వీడి తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా పాలనా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం విజయవంతంగా వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుందని అన్నారు.
అధికారం వచ్చిందని కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి డివిజన్లో పర్యటిస్తూ, ప్రజల మధ్య ఉంటూ, వారి అవసరాలను తెలుసుకుని ప్రజా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గత మూడేళ్లలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సుమారు రూ.1,000 కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రామగుండం ప్రధాన వ్యాపార, విద్యా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, బాలసాని తిరుపతి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, ముస్తాఫా, డేవిడ్ రాజు, వడ్లూరి రవి, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
