
సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి….
76 జీఓ అమలు చేసి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి….
రామగుండంలో 1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలి…
అసెంబ్లీలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి….
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి హైదరాబాద్, : సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు. తెలంగాణ శాసనసభలో సింగరేణి కార్మికుల సమస్యలను ఆయన ప్రస్తావించారు.
76 జీఓను అమలు చేసి సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి మారు పేర్ల సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి అర్హులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.
కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి
సింగరేణి పరిధిలో సుమారు 50 వేల క్వార్టర్లు ఉండగా, వాటిలో దాదాపు 28 వేల క్వార్టర్లలో కార్మికులు నివసిస్తున్నారని రాజ్ ఠాకూర్ తెలిపారు. అనేక క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయని, కొత్త ఇళ్ల నిర్మాణానికి తగిన అవకాశాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.
కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పరిశ్రమలు, గనుల కార్యకలాపాలతో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రస్తుతం వినియోగంలో లేని భూములను గుర్తించి, వాటిని కార్మికుల గృహ నిర్మాణానికి వినియోగించే అవకాశం కల్పించాలని సూచించారు. ఒక్కో కార్మికుడికి సుమారు 100 గజాల స్థలం కేటాయించి, హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకునే విధంగా గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకోసం అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలి
రామగుండం నియోజకవర్గానికి మంజూరైన ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులకు టెండర్లు పూర్తయినప్పటికీ ఏడాది కాలంగా పనులు ప్రారంభం కాకపోవడాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ల అనంతరం ప్రక్రియను సవరించి, ఒప్పంద ప్రక్రియ పూర్తిచేసి తిరిగి ఉన్నతస్థాయి కమిటీకి పంపించినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు.
ఈ సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతస్థాయి కమిటీ ప్రక్రియను పరిష్కరించాలని కోరారు. వెంటనే అనుమతులు పూర్తి చేసి రోడ్ల పనులు ప్రారంభిస్తే ఈ ఏడాదిలోనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మించాలి,రామగుండం ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన 1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను మరింత ఆలస్యం చేయకుండా త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
