
రైస్ మిల్ యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కరించాలి….
రైస్ మిల్లుల సమ్మెతో ఉపాధి కోల్పోయిన హమాలీలను ఆదుకోవాలి….
సమ్మె విరమణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి…
లేకపోతే హమాలీలతో హైదరాబాద్‌ను ముట్టడిస్తాం….
— హమాలీ ఫెడరేషన్ నేతల హెచ్చరిక…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్ యాజమాన్యాలు చేపట్టిన సమ్మె కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హమాలీ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజ్, కడారి సునీల్ డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల సమ్మెను విరమింపజేసి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం, కమిషనర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ యాజమాన్యాలు గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాయని తెలిపారు. సమ్మె ప్రభావంతో ప్రధానంగా అసంఘటిత రంగానికి చెందిన హమాలీ కార్మికులతో పాటు ఆపరేటర్లు, స్వీపర్లు, వలస కార్మికులు, సాంకేతిక సిబ్బంది, గుమస్తాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే రైస్ మిల్ యాజమాన్యాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను సత్వరమే చెల్లించి రైస్ మిల్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఒకరిద్దరు వ్యక్తులు ప్రభుత్వాన్ని మోసం చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు మొత్తం పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.
రైస్ మిల్లుల సమ్మె మరింత ఉధృతమైతే దాని ప్రభావం రైతులపైనా పడే ప్రమాదం ఉందని నాయకులు హెచ్చరించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాకాల పంటలు చేతికి వచ్చే సమయంలో ధాన్యం లోడింగ్, రవాణా, ఎగుమతి, దిగుమతుల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైస్ మిల్లర్ల సమ్మెను విరమింపజేయాలని కోరారు.
అనంతరం పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయ జనరల్ మేనేజర్ అనిల్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే హమాలీ కార్మికులతో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హమాలీ యూనియన్ నాయకులు ఎం. తిరుపతి, ఎం. కుమార్, ఓదెలు, ఎం. గట్టయ్య, మహేష్, శంకర్, లక్ష్మణ్, భూషణ్, రవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
