నిరుపేదలకు సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్

Spread the love

నిరుపేదలకు సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్: గణేష్ నగర్ డివిజన్ పరిధిలోని ద్వారక నగర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకు ఉపయోగపడుతున్నాయని కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లభించని కుటుంబాలు సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణ యాదవ్, పెంటయ్య ముదిరాజ్, సిహెచ్ బుచ్చిరెడ్డి, అలివేలు, బాలప్ప, నగేష్, విజయ్ గుప్తా, రవీందర్ గౌడ్, కోన రాఘవేంద్ర గౌడ్, సురేందర్, అక్బర్, సంగమ్మ, భూషణం, శ్రీధర్, రాజేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు , రేషన్ కార్డు లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top