ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలి: బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల డిమాండ్

Spread the love

ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలి: బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల డిమాండ్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ నిర్వహించిన సోదాలు, అనంతరం కొనసాగిన దర్యాప్తు వివరాలను వెల్లడించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్‌వై ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, సంజయ్ పార్టీ సీనియర్ నాయకులు తలసాని సాయి,బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు తొలుత అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా, అనంతరం అధికారులను కలిసి లేఖ అందించేందుకు పోలీసులు అనుమతించారు.

ఈడి డిప్యూటీ డైరెక్టర్ స్వాతి ని కలిసి లేఖను అందించారు…

రెండేళ్లుగా దర్యాప్తు ఏ దశలో ఉంది?

2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరిగిన ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తన లేఖలో కోరింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరింది.

ఈడీ సోదాలు సుమారు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయని, పెద్ద సంఖ్యలో అధికారులు, CRPF సిబ్బంది పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా తీసుకెళ్లినట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంది. అయితే సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులు, తదుపరి దర్యాప్తు చర్యలపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదని ప్రశ్నించింది.

పలు కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రశ్నలు.

నరసాపూర్ కోదండల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వాటింగపల్లి FIR, కొత్వాల్‌గూడ–మనసా హిల్స్‌కు సంబంధించిన అంశాలను కూడా లేఖలో ప్రస్తావిస్తూ, ఆయా వ్యవహారాల్లో దర్యాప్తు పురోగతి ఏమిటో వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ కోరింది.

ఈడీకి బీఆర్‌ఎస్‌ అడిగిన ప్రధాన ప్రశ్నలు

2024 సెప్టెంబర్ 27, 28 తేదీల సోదాలకు సంబంధించిన ECIR/కేసు వివరాలు ఏమిటి?

సోదాల్లో ఎంత నగదు, ఎలాంటి పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు?

స్వాధీనం చేసుకున్న వస్తువులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి?

సంబంధిత వ్యక్తులకు నోటీసులు లేదా సమన్లు జారీ చేశారా?

దర్యాప్తు అనంతరం ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారా?

సీజ్ చేసిన ఆస్తులు, వాచ్‌లు తదితరాల ప్రస్తుత స్థితి ఏమిటి?

దర్యాప్తు ప్రస్తుత స్థితి ఏమిటి? తదుపరి చర్యలు ఏమిటి?

ఈ వివరాలను 15 రోజుల్లోగా వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ ఈడీని కోరింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లయితే, తదుపరి చర్యలకు సంబంధించిన కాలపరిమితిపై కూడా స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరింది.

చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నదే తమ అభిప్రాయమని, ప్రజలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top