
విద్యార్థుల పౌష్టిక ఆహారమే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి
27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో అల్పాహారం..
ప్రపంచంలోనే ప్రత్యేకం
విద్యార్థుల పౌష్టికాహారం పై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి-
సంక్షేమం ఉచితం కాదు.. రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి-
*డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సూర్యాపేట జిల్లా /మునగాల
కోదాడ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల పౌష్టికాహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఉచితం కాదని, రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాలలో రూ.9.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. మునగాలలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ ద్వారా 1,020 పాఠశాలల్లోని సుమారు 60 వేల మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని, మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ ఇస్తున్నామని చెప్పారు. ఇంటివద్ద వంద మందికి వంట చేయడం కూడా కష్టమైన పరిస్థితుల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో అల్పాహారం అందించడం తెలంగాణ ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమన్నారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, ఎదిగే వయసులో వారికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన మానవ వనరులను తయారు చేయవచ్చని తెలిపారు.
సంక్షేమం ఉచితం కాదు.. రాష్ట్రంపై పెట్టుబడి
పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఉచితాలుగా చూడకూడదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రయోజనం చేకూర్చే పెట్టుబడి అని చెప్పారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల లక్ష్యం పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు.
బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు.బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చేస్తున్న ప్రకటనలపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని, ఏం చేయడానికి వస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఆర్థిక సాయం వంటి పథకాలను నిలిపివేయడానికే వస్తారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు.నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని తీసుకురానున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమానికి అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్‌ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే పాఠశాలలో సమానంగా చదువుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు క్రీడా మైదానాలు, స్టేడియం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
ప్రజలే మా కుటుంబం
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలే తమ కుటుంబమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారాన్ని ప్రదర్శించేందుకు కాకుండా ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేందుకు పనిచేయాలని సూచించారు. ఆ కోవలోనే ఉత్తమ్ దంపతులు ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు.
మునగాల హెలిప్యాడ్ నుంచి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ శంకుస్థాపన ప్రాంతం వరకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సుమారు 500 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
