
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు.. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి….
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
ప్రజల నుంచి అందుతున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం ఆయా శాఖల అధికారులకు వాటిని పంపిస్తూ నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన గండి సుగుణ తనకు అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరిఖనికి చెందిన సువర్ణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పేషంట్ కేర్ విభాగంలో పనిచేస్తుండగా 15 రోజులకే తొలగించారని, తిరిగి ఉద్యోగంలో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై గోదావరిఖని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నివేదిక కోరుతూ తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన మాచర్ల సుగుణ తన భర్త మరణించడంతో వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సంబంధిత అధికారులు అర్హతలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించడం అధికారుల బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
