
జీఇఎం–2026 విజయవంతంగా ముగింపు…
ఎన్‌టీపీసీ రామగుండంలో విద్యార్థినుల ప్రతిభా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి…
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం ఎన్‌టీపీసీ, ఎన్‌టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన గర్ల్ ఎంపవర్‌మెంట్ మిషన్ (జి ఇ ఎం–2026) నెలరోజుల నివాస శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కాకతీయ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పర్యావరణహిత మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం దీపప్రజ్వలన చేసి ఎన్‌టీపీసీ గీతాన్ని ఆలపించారు. జీఈఎం–2026లో నిర్వహించిన కార్యక్రమాలు, విద్యార్థినుల ప్రతిభ, సాధించిన విజయాలను ప్రతిబింబించే వీడియోతో పాటు స్వచ్ఛత పఖ్వాడా ప్రత్యేక చిత్రాన్ని ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు గణేశ్ వందనంతో ప్రారంభమై ఆహూతులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంగా రూపొందించిన నాటిక, జానపద నృత్యాలు, యోగా ప్రదర్శన, ఉత్సాహభరితమైన పంజాబీ డాన్స్, కరాటే మరియు నంచాకు విద్యలతో కూడిన స్వీయ రక్షణ ప్రదర్శన, రంగురంగుల రాజస్థానీ నృత్యం ప్రేక్షకులను అలరించాయి.
ఈ సందర్భంగా జీఈఎం విద్యార్థినులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఎన్‌టీపీసీ అందించిన శిక్షణ ద్వారా తమలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెరిగిందని పేర్కొన్నారు. రామగుండంలో గడిపిన రోజులు జీవితాంతం గుర్తుండిపోతాయని భావోద్వేగంగా తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేసి గ్రూప్ ఫోటో నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ హెడ్ (ఆర్ & టీ) చందన్ కుమార్ సమంత మాట్లాడుతూ విద్యార్థినులు విద్య, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు విద్యార్థినులను అభినందించారు.
చివరిగా నిర్వాహకులు, మెంటర్లు, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.
జీఈఎం–2026 ముగింపు కార్యక్రమం బాలికల సాధికారత, సమగ్ర అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.