
జిల్లా అధికారుల అవినీతి బాగోతం బయటపెడతామంటే ఎందుకంత ఉలికిపాటు
పోలీసుల అండతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరు
బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుల వెంటే పోలీసుల పహారా దేనికోసం….—-బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి :
జిల్లా అధికారులు ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని, ఎప్పుడు లేని విధంగా కలెక్టరేట్ ముందు పదుల సంఖ్యలో పోలీస్ బందోబస్తు దేనికోసం ఏర్పాటు చేశారని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.
సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి కుంభకోణంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేయాలనుకోవడం అవివేకమే అన్నారు.
బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు కలెక్టరేటుకు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో జిల్లా అధికారులు కలెక్టరేట్లో ఎప్పుడు లేనివిధంగా పోలీసుల పహారా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
తాము ఎటు వెళ్తే అటు పోలీసులను వెంట తిప్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
తాము దేశద్రోహులమో లేక తీవ్రవాదులమో కాదని, జిల్లా అధికారుల అవినీతి బాగోతం బయటపెడతామంటే ఎందుకంత ఉలిక్కిపాటు అంటూ పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని అవినీతితో చెలరేగిపోతామంటే చూస్తూ ఊరుకోమని, జిల్లా అధికారుల అవినీతి బాగోతంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని, అదేవిధంగా మంగళవారం హైదరాబాదులో నిర్వహించే ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
వచ్చే సోమవారం లోపు డిఎస్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే వందల సంఖ్యలో రైతులను సమీకరించి కలెక్టరేటును ముట్టడించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.