కళాకారుడికి ఘన సన్మానం చేసిన ఆర్జీ-2 కళాకారులు….

TEJA NEWS

కళాకారుడికి ఘన సన్మానం చేసిన ఆర్జీ-2 కళాకారులు….

ఉద్యోగ విరమణ ఉద్యోగానికే కానీ కళకు కాదు, కళాకారుల అభిప్రాయం….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ఆర్జీ-2 ఏరియాలోని జీడీకే ఓపెన్ కాస్ట్ గని-3లో ఈపీ సీనియర్ మెకానిక్‌గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ కళాకారుడు, గిటారిస్ట్, కీబోర్డు వాద్యకారుడు సింగారపు ఆశయ్య దంపతులను సోమవారం ఎనిమిదవ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో ఆర్జీ-2 కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

పూలమాలలు, శాలువా, సన్మాన పత్రంతో ఆశయ్య దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ సింగారపు ఆశయ్య సింగరేణిలో ఉత్తమ కళాకారునిగా గుర్తింపు పొందారని తెలిపారు. సింగరేణి దినోత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, రక్షణ నాటికలు తదితర అనేక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చి కళారంగానికి విశేష సేవలందించారని కొనియాడారు.

సింగరేణిలో 38 సంవత్సరాల పాటు ఫిట్టర్‌గా సేవలందించిన ఆశయ్య, కళాకారులందరితో ప్రేమాభిమానాలతో మెలిగేవారని, ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగానికే కానీ కళకు కాదని అభిప్రాయపడ్డారు.

సన్మాన గ్రహీత సింగారపు ఆశయ్య మాట్లాడుతూ తనను ఆత్మీయంగా సన్మానించిన ఆర్జీ-2 కళాకారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంగీతాన్ని ప్రేమిస్తే మానసిక ఒత్తిడి దూరమవుతుందని, సంగీతం మనిషికి శక్తినిస్తుందని అన్నారు. ప్రతి కళాకారుడు సంగీత కళను అభ్యసించి కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి సంస్థకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

సింగరేణి ఉద్యోగ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోయిని రాజారాం, ప్రధాన కార్యదర్శి బుంభక్ రాకేష్, సహాయ కార్యదర్శి కోల కృష్ణ, కోశాధికారి గీస రామారావు, సలహాదారు సయ్యద్ హమీద్, కార్యవర్గ సభ్యులు నీలం రవి, ప్రేమ్ కుమార్, ప్రమోద్ కసల్, మాజీ ఉద్యోగి రాజ్ మహమ్మద్, సీఈఆర్ క్లబ్ బాయ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top