
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం.. ప్రతి పాఠశాలలో నాణ్యమైన బోధనకు ప్రత్యేక కార్యాచరణ….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
నిర్వహించిన ప్రాథమిక ఉపాధ్యాయుల డీఆర్‌పీ బృందం సమీక్ష సమావేశంలో గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన కార్యక్రమాల ఫలితాలను సమీక్షించిన కలెక్టర్, ఈ ఏడాది కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంతో పాటు పాఠశాలల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న ఐదు ప్రాథమిక పాఠశాలలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస ఫలితాలను ప్రతి నెల సమీక్షిస్తూ అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విద్యా ప్రమాణాల పెంపు, సమర్థవంతమైన బోధన, అభ్యాస ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వార్షిక విద్యా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ) షేక్, అలోకిట్ పర్యవేక్షకులు, ప్రాథమిక స్థాయి డీఆర్‌పీ బృందం పాల్గొన్నారు.
