
ఏజెన్సీల రద్దుకై, ఆసుపత్రి కార్మికుల వేతనాల పెంపుకై…తెలంగాణ ఆరోగ్యశాఖ కార్యాలయం ముట్టడి.
ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల దశాబ్దాల ఆకలి గోస తీర్చండి.
కే.విజయరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి.
ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పట్ల వివక్ష తగదు. పి సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి.
వేతనాల పెంపుకై ఈనెల 7నుంచి మూడు రోజుల ఆసుపత్రి కార్మికుల పోరుబాట ఆందోళన నోటీసు అందజేసిన ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు.
వనపర్తి
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు దశాబ్దాల తరబడి కొనసాగుతున్న చాలీచాలని జీతాల ఆకలి గోస తీర్చేందుకు ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ఆసుపత్రి కార్మికులకు నేరుగా కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కనీస 26 వేల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఏడు నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పోరుబాట ఆందోళన నోటీసుతో శనివారం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నోటీసులను జనరల్ ఆసుపత్రి అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి సంఘీభావంగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు మాట్లాడుతూ:- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండా ఉద్యోగ భద్రతకు నోచుకోకుండా దినదిన గండంగా కార్మికుల జీవితాలు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలు పారదర్శకంగా లేవని వాటిని సవరించి తెలంగాణ కనీస వేతన బోర్డు సూచించిన సిఫారసులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కనుక కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ మాట్లాడుతూ:- ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వివక్ష వైఖరి తగదని అన్నారు.కాల పరిమితి ముగిసిన ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల వేతనాల పెంపుకై, ఏజెన్సీల వ్యవస్థ రద్దుకై ఈ నెల 7 మరియు 8 తేదీలలో ఆసుపత్రుల ఎదుట రోజు గంట పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను వేలాదిమంది ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఆసుపత్రి కార్మికుల పోరుబాటకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి గౌను గీతమ్మ, నాయకురాలు కొండికంటి పద్మావతి,ఆసుపత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు కార్మికులు నరసింహ, గంధం శీను, శ్యామ్, షాబాద్,రవి, ఆంజనేయులు, వెంకటయ్య,పవన్, శ్రీకాంత్,శివ,గణేష్, శ్రీను,కలవతమ్మ, గోవిందమ్మ, ప్రేమ కుమారి, సంతోషమ్మ, భాగ్యలక్ష్మి,అంజనమ్మ, శ్వేత,రాజేశ్వరి, యాదమ్మ, నవనీత,రజిత,బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
