
ప్రజల పాటలో చిరంజీవి కామ్రేడ్ అరుణోదయ నాగన్న..
జూలై 19న. ఎన్‌టీపీసీలో సంతాప సభను విజయవంతం చేయాలని పిలుపు…
పెద్దపల్లి//గోదావరిఖని, ప్రజా సాంస్కృతికోద్యమానికి విశిష్ట సేవలందించిన అరుణోదయ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, ఈ నెల 19న ఎన్‌టీపీసీలో నిర్వహించనున్న సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఎన్‌టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం ముందు నిర్వహించనున్న సంతాప సభకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు బతుకుల రాజన్న మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో జన్మించిన పరకాల నాగన్న, “అరుణోదయ నాగన్న”గా గోదావరి లోయ ప్రాంతమంతటా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన, ప్రజల కష్టసుఖాలను పాటల రూపంలో ప్రతిబింబిస్తూ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు తన గానంతో ఊపిరి పోశారని పేర్కొన్నారు.
చదువు పెద్దగా లేకపోయినా ఒకసారి విన్న పాటను గుర్తుంచుకుని ఆలపించే అసాధారణ ప్రతిభ ఆయన సొంతమని, అనేక ప్రజా గేయాలు, అమరవీరుల గీతాలు, నాటికల ద్వారా సామాన్య ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. ఎన్ని అవకాశాలు, ప్రలోభాలు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిరాడంబర జీవితం గడిపిన వ్యక్తిగా నాగన్న ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అరుణోదయ నాగన్న పేరు తెలియని ప్రజా కళాకారుడు లేడని, ఆయన ఆలపించిన అమరవీరుల గీతాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని చెప్పారు. నాగన్న భౌతికంగా దూరమైనా, ఆయన పాటలు ప్రజల ఉద్యమాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటాయని, ఆయన ఆశయ సాధన కోసం పోరాడటమే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ నెల 19న. ఎన్‌టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం ముందు నిర్వహించనున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభకు కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణతో పాటు ఈ. నరేష్, ఎస్. ప్రసాద్, చింతల శేఖర్, ఎడ్ల రవికుమార్, ఎండీ ఆసిఫ్, ప్రేమ్ కుమార్, సాయికుమార్, ఓం ప్రకాష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.