
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో అప్రమత్తంగా ఉండాలి: డా. బి. సతీష్ చంద్ర
పెద్దపల్లి//
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం జిల్లా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. సతీష్ చంద్ర సూచించారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో సాధారణంగా ఈ సమయానికి 237.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ప్రస్తుతం 206.6 మిల్లీమీటర్లు మాత్రమే కురవడంతో 13 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటికే సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయని పేర్కొన్న ఆయన, ఇంకా నాట్లు వేయని రైతులు 120 రోజుల స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేసుకుని జూలై 15లోపు నాట్లు పూర్తి చేయాలని సూచించారు. జూలై 15 తర్వాత నాట్లు వేసే రైతులు తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) రకాన్ని సాగు చేయడం అనుకూలమని తెలిపారు.
పత్తి రైతులు జూలై 20లోపు విత్తనాలు పూర్తి చేయాలని, మట్టిలో తేమను పరిశీలించి విత్తనం వేయాలని సూచించారు. పత్తిలో అంతర పంటలుగా కంది, ఇతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.
మొక్కజొన్న సాగుకు 90–100 రోజుల స్వల్పకాలిక లేదా 100–110 రోజుల మధ్యకాలిక రకాలు అనువైనవని, జూలై 16 నుంచి 31 మధ్య విత్తనాలు పూర్తి చేయాలని సూచించారు. తక్కువ వర్షపాత పరిస్థితుల్లో కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, సజ్జ వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన ప్రణాళికతో పంటల సాగు చేపడితే దిగుబడులపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చని, రైతులు వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలని డాక్టర్ బి. సతీష్ చంద్ర కోరారు.