అత్యాశ.. భయమే సైబర్ మోసగాళ్ల ఆయుధాలు

TEJA NEWS

అత్యాశ.. భయమే సైబర్ మోసగాళ్ల ఆయుధాలు
వ్యక్తిగత సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత….

— డీసీపీ ఏ. భాస్కర్…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, చెన్నూర్/ : సైబర్ నేరాల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ప్రజల అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు” కార్యక్రమంలో భాగంగా చెన్నూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్‌లో ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఉద్యోగ సంబంధిత సమాచారం, వ్యక్తిగత ఫొటోలు తదితర కీలక సమాచారం ఉంటుందని తెలిపారు. ఈ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భయపెట్టి.. ఆశ చూపించి మోసాలు
పోలీసుల పేరుతో అరెస్ట్ చేస్తామని బెదిరించడం, పిల్లలు నేరంలో చిక్కుకున్నారని చెప్పి భయపెట్టడం వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని డీసీపీ తెలిపారు. అదేవిధంగా లాటరీలు, భారీ లాభాలు, తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వంటి ఆశలు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించినట్లవుతుందని హెచ్చరించారు. “రూ.1,000 పెట్టుబడితో నెలలో రూ.3,000 లాభం” వంటి అసాధారణ ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు.

ముందస్తు జాగ్రత్తలే రక్షణ కవచం
సైబర్ భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకమని డీసీపీ భాస్కర్ తెలిపారు. ఎవరికీ ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, తద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే 1930కు ఫోన్ చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సాంకేతికతను వినియోగించాలని కోరారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top