
24 గంటల్లోనే జంట హత్య కేసు ఛేదన
ఇద్దరు నిందితుల అరెస్ట్
సూర్యాపేట,
మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారం ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మోతే మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365బీబీ ఫ్లైఓవర్ సమీపంలోని వ్యవసాయ భూమిలో పాక్షికంగా పూడ్చిపెట్టిన రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అవి బిక్యతండాకు చెందిన హలావత్ నాగులు (41), ఆయన భార్య హలావత్ బూబావిగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు రెండో నిందితుడు జిల్లేపల్లి సుందర్ కదలికలను గుర్తించారు.
అనంతరం ప్రత్యేక బృందాలు సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద మోతే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎం.డి. షరీఫ్ (23), జిల్లేపల్లి సుందర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాయి. మృత దంపతులకు షరీఫ్ రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో పాటు తనపై కేసులు పెడతామని బెదిరించడంతో వారిని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. సుందర్ సహకారంతో ఆగస్టు 11న నాగులును, అనంతరం బూబాను వేర్వేరుగా ఒకే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, మోటార్‌సైకిల్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సీసీఎస్ అధికారులు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రత్యేక బహుమతులు ప్రకటించారు.
