
48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జె్ట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయింపులు జరిపారు. ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరనుంది.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు
▪️గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను ప్రభుత్వం పేర్కొంది.
▪️ఎరువుల స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు.
▪️ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు.
▪️వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు.
▪️7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం.
▪️డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు.
▪️875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు.
▪️వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు.
▪️విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు.
▪️రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు.
▪️అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు.
▪️ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు.
▪️వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు.
▪️ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు.
▪️పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు.
▪️సహకారశాఖకు రూ.239.85 కోట్లు.
▪️పశుసంవర్థకశాఖకు రూ.1,112.07 కోట్లు.
▪️మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రసంగం చేశారు. మొత్తం రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి ఉంటుందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యంగా చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించారు. 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామన్నారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం చేపట్టామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని.. అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు.
