
పెయిడ్ మీడియాలు ప్రజల అభిప్రాయాలను మార్చగలవా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ వాదం పనిచేసింది?
సీఎంకి దగ్గర మీడియాలే కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వెనక మర్మం ఏంటి?
రేవంత్‌కే ఓ బ్రమ కల్గేలా మాయ చేసిన మీడియాలను ఇకనైనా దూరం పెడతారా?
……………………………………………………..
రాష్ట్రంలో కొన్ని మీడియాలే కాక కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు నిష్పక్షపాత ముసుగులో వివిధ పార్టీలు,వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుంటూ ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఇంకొంతమంది ప్రత్యర్థుల వ్యాపార సంస్థలను దెబ్బతీయడానికి పదేపదే దుష్ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు.ఇలాంటి పెయిడ్ జర్నలిజం ఇప్పుడు మొత్తం పాత్రికేయాన్ని కమ్మేసింది.ఏది నిజమో? ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయంలో ప్రజలు ఉన్నారు.మొబల్ ఫోన్‌ల వినియోగం పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ అంతర్జాలం వినియోగిస్తూ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలో చాలామందికి ఏది నిజమైన జర్నలిజమో?ఏది పెయిడ్ పాత్రికేయమో గుర్తించగల విచక్షణత ఉండదు.ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ఇలాంటి పెయిడ్ జర్నలిజం దెబ్బకు పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఆదరణ కోల్పోతున్నాయి.ప్రజలకు మనం అందించేది మంచీ చెడు,దాని ప్రభావం,జర్నలిజం విలువలు,కట్టుబాట్లు ఇలాంటి అంశాలు పెయిడ్ జర్నలిజం ముఠాలకు అక్కర్లేదు. తాము ఎవరి కోసం పనిచేస్తున్నామో వారిని అందలం ఎక్కించడానికి ప్రత్యర్థులను దెబ్బతీయడానికి దుష్ప్రచారం అనే దుర్మార్గపు జర్నలిజాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించాలనే లక్ష్యమే వీరి ప్రధాన పని.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇలాంటి పెయిడ్ జర్నలిజం ఆగడాలు రోజు రోజుకి పేట్రేగిపోతున్నాయి.గత కేసీఆర్ పదేండ్ల పాలనలో కొందరు జర్నలిజం ముసుగేసుకుని నిత్యం కేసీఆర్ అండ్ ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని రాయకూడని భాషలో బూతుల దండకాలను నిత్యం చదివిన విషయం తెలిసిందే.ఆఖరికి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కేటీఆర్ కుమారుడు హిమాన్షు మీద కూడా అనేక హద్దులు దాటిన వీడియోలు,వార్తలు ప్రచారం చేసిన విషయాన్ని చూశాం.ఎవరైతే కేసీఆర్ అండ్ ఫ్యామిలీని పూర్తి అభ్యంతరకర,అశ్లీల భాషలో దూషిస్తున్నారో కేసీఆర్ అంటే గిట్టని వారు,ద్వేషించేవారంతా ఇలాంటి జర్నలిస్టులు,మీడియాలను ఆదరించారు.ఇలా కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణ పొందిన ఇలాంటి మీడియాలకు తెరవెనక నుంచి కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు,బీజేపీలోని మరికొన్ని పెద్ద తలకాయలు అన్ని రకాల ఆర్థిక సాయాలను అందించారు.దీంతో చిన్నగా మొదలైన దుష్ప్రచార మొక్క గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందునాటికి పెద్ద విష వృక్షాలయ్యాయి.ఈ విష వృక్షాలు నేడు బ్లాక్‌మెయిలింగ్,దుష్ప్రచారాల ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్న వైనం కన్పిస్తోంది.పైగా మేం తలచుకుంటే ఈ ప్రభుత్వాలనే కూల్చేస్తామంటూ అహంకార పూరిత ప్రకటనలు ఇస్తుండటం విస్తుపోయే అంశమే.ఇక గతంలో మా పాలన మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇప్పుడు మేం కూడా మీ పాలన మీద అదే అస్త్రాన్ని ఉపయోగిస్తామనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పెద్దలు కూడా అనేక రకాల పెయిడ్ జర్నలిస్టులను,మీడియాలను రంగంలోకి దించింది.ఇలాంటి పెయిడ్ జర్నలిస్టులు, మీడియాలతో నేటి రేవంత్ సర్కార్‌పై నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో కొందరు అవగాహన లేని పెయిడ్ జర్నలిస్టులు,మీడియాలు రాష్ట్ర సీఎంకే సవాళ్లు విసురుతూ వీడియోలు చేస్తున్నారు.ఇంకొందరు దుష్ప్రచార పెయిడ్ యూట్యూబర్ ఒకరు..ఏకంగా రాష్ట్ర సచివాలయం మీదనే దుమ్మెత్తి పోస్తూ వీడియో తీయడం గమనార్హం.సచివాలంలో వాష్ రూమ్‌లు లేవంట,క్యాంటీన్లు లేవంట,ఇరుకు గదులంట..మొత్తం కట్టడమే పనికిరాదంటూ ఏదో అజ్ఞానపు వీడియో చేయడం చూశాం.ఇతగాడి ఉద్దేశం ఒక్కటే కేసీఆర్ హయాంలో ఈ నిర్మాణం పూర్తయింది కావున ఇది పనికి రాని కట్టడం అని తేల్చితే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆనందపడి మరింత ప్యాకేజీ పెంచుతాడనే ఆశ.అంతకు మించి ఏం లేదు.ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్యాకేజీ అందుకుంటున్నట్లుగా ప్రచారం పొందిన కొన్ని ఇలాంటి మీడియాలే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతున్నారనే దుష్ప్రాచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి.దీనికి కారణం తమకు కాంగ్రెస్ అభ్యర్థులు ప్యాకేజీలు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం అంటూ తప్పుడు ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాయి.ఇలాంటి దుష్ప్రచారంతో వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు.ముఖ్యమంత్రే నమ్మేలా ఈ మీడియాలు కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలో ఉంటున్నారని,బీఎస్పీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉంటారని ప్రచారం చేయడం గమనార్హం.గమ్మత్తయిన విషయం ఏంటంటే డిజిటల్ పత్రికలో అగ్రశ్రేణి పత్రికగా చెప్పుకుంటున్న ఓ మీడియా కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రాయడం చూశాం.ఈ మీడియాకు నేటి సీఎం రేవంత్ రెడ్డే మొదటి నుంచి అన్ని సాయాలు అందించారు.అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూల ప్రచారం చేయకున్నా..పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాయడం వెనక లోగుట్టు ఏంటో సీఎం రేవంత్ రెడ్డికే తెలియాలి.కేసీఆర్ ఫ్యామిలీని డ్యామేజీ చేయడానికి ఇలాంటి మీడియాలను చేరదీసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓడిపోయే పక్షంలో దానికి ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.ఇలాంటి మీడియాల ప్రచారాన్ని సీఎం నమ్మి కరీంనగర్ సభలో పార్టీ అభ్యర్థి గెలవకున్నా మాకు నష్టం లేదనే వ్యాఖ్యలు చేయడం చూశం.ఈ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి గెలుపు అవకాశాలను దెబ్బతీశాయనే చెప్పవచ్చు.అంటే ఒక సీఎంనే నమ్మించే స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతున్నారంటూ తమ తప్పుడు వార్తలు,వీడియాల ద్వారా చేసే ఇలాంటి మీడియాలకు కాంగ్రెస్ సర్కార్ సాయాలు అందించడం ఎంతవరకు సబబు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇక మరికొంతమంది పెద్ద పత్రికల స్థానిక పాత్రికేయులు ఇచ్చే సమాచారాన్ని నమ్మి కొన్ని పెద్ద మీడియాలు కూడా ఇదే ప్రచారాన్ని నిజం అనుకుని కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలో ఉండబోతున్నారంటూ వార్తలను ప్రసారం చేయడం గమనించాల్సిన అంశం.స్థానిక విలేకర్లు కేవలం తమకు కాంగ్రెస్ అభ్యర్థి నచ్చరనో,తమ కులంవాడు కాదనో ఆలోచనతో ఫక్తు రాజకీయపార్టీల కార్యకర్తల్లా వార్తలు అందించడం చూశాం.వాస్తవాలు రాయకున్నా పర్వాలేదు కానీ లేని అంశాన్ని ఓ ఫేక్ సమాచారం ప్రజల్లోకి చొప్పించి ప్రజల ఓటింగ్ సరళిని తమకు నచ్చిన అభ్యర్థి వైపు డైవర్ట్ చేయాలని చూసిన ఇలాంటి మీడియాలది ఏ రకమైన జర్నలిజమో ప్రజలు అర్థం చేసుకోవాలి.ఇక కొందరు అవగాహన లేని వ్యక్తులు ఏవో తమకు నచ్చిన డయాగ్రామ్‌లు గీసి పై మీడియాలు ప్రచారం చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో ఉండబోతున్నారంటూ ఏవో సర్వేల పేరిట ప్రచారం చేపట్టడం మరో వింత.నిజానికి సర్వే చేయాలంటే ఎంతో ఖర్చతో కూడుకున్న వ్యవహారం.అలాంటిది ఇంట్లో కూర్చుని ఈ పెయిడ్ మీడియాల ప్రచారాన్ని నమ్మి ఈ సర్వేలు ఇచ్చే వింతను కూడా చూశాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ వాదం గెలిచింది?
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ వాదం బలంగా వీచింది..ఈ వాదం ఊపేసిందంటూ రకరకాల ప్రచారాలను చూశాం,ఇదంతా పెయిడ్ మీడియాలు,వ్యక్తులు చేసిన ప్రచారమే.ఎంతో విజ్ఞతకల ఉపాధ్యాయులు,పట్టభద్రుల మీద కూడా విచ్చలవిడిగా ప్రలోభాల పర్వం నడిచిందనే ఆరోపణలు రావడం సిగ్గు చేటు.ఇప్పటికే చట్ట సభల్లో పోటీ చేయాలంటే సామాన్యులకు కలలో కూడా కుదరని విధంగా ఎన్నికలు ఉన్నాయి.కనీసం శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేకున్నా మండలిలోనూనా ఉపాధ్యాయులు,నిరుద్యోగులు,జర్నలిస్టుల పక్షాన సామాన్యులు పార్టీలకు అతీతంగా అడుగుపెట్టాలనే లక్ష్యంతో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకన్నా ఖరీదుగా మారటం దురదృష్టకర పరిణామం.తమ ఓటు తాము వేయడానికి,తమ పక్షాన గొంతు విన్పించడానికి ‘ డబ్బో రామచంద్రా’..అంటూ అటు ఉపాధ్యాయులు,పట్టభద్రులు మూడొంతుల మంది ఆకలితో కేకలు వేయడం ముందు ఏ వాదాలు పనిచేయవు.ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా గెలుపోటములున్నప్పుడు ఏ వాదం గెలిచిందని,ఏ వర్గం ఓడిరదని విశ్లేషణలు చేసుకోవడం వ్యర్థం.ఇప్పటికైనా శాసనమండలిలో సామాన్యులకు,విద్యావంతులకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా అడుగు పెట్టే అవకాశం ఉండేలా అన్నిపార్టీలు ఆలోచించాలి.అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే ఓ మీడియా..ఓ జర్నలిస్టు ప్రజల అభిప్రాయాలను,నేతల గెలుపోటములను పూర్తిగా ప్రభావితం చేయలేరు.ఈ విషయం తెలియని కొందరు రాజకీయ నేతలు పెయిడ్ మీడియాలను పెంచి పోషించించడం దండగ పనే.మరి ఈ విషయం చెవికెక్కనన్ని రోజులు ఇలాంటి పెయిడ్ మీడియాలు,దుష్ప్రచార జర్నలిస్టులు చెలరేగిపోతూనే ఉంటారు.
