
సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డి.ఇ.ఓ ఎల్. చంద్రకళ.
ప్రాథమిక పాఠశాల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ జరగడం సంతోషదాయకం.: డీఈవో.
ఎన్.ఉమామహేశ్వరి ని దుశ్శాలువ తో సత్కరించిన డి.ఇ.ఓ.
ఎడ్లపాడు మండలం లోని మైదవోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సైన్స్ దినోత్సవాన్ని పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్. చంద్రకళ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా సి.వి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి ఆవిష్కరించారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులంతా సైన్స్ కి సంబంధించిన ప్రయోగాలు, గణితానికి సంబంధించిన చతుర్విధ ప్రక్రియలను ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్కింగ్ మోడల్స్ తయారు చేశారు.భాగహార యంత్రం, భాషాభాగాలకు సంబంధించిన నమూనాలు (మోడల్స్) , ఒత్తుల బుట్ట, స్థాన విలువలు, కమ్యూనికేషన్ ప్రిపోజిషన్, వాట్సాప్ స్పీచ్,పద్యాల బుట్ట, నీటిని శుభ్రపరచు విధానము, తిథులు, ఇల్లు-రకాలు.. ఇలా ఇంకా కోకరిక్యులర్ విభాగంలో కాఫీ పెయింటింగ్, లో కాస్ట్ తో తయారు చేసిన బ్యాగులు, బుట్టలు, ఫోటో ఫ్రేములు, గ్లాస్ పెయింటింగ్స్ లాంటి కళాఖండాలు కూడా ప్రదర్శించారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలస్థాయిలో ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ జరగడం చాలా సంతోషదాయకం అన్నారు.
చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా అన్ని ప్రయోగాలను వివరించారని, విద్యార్థులను ఇంతటి ప్రయోజకులుగా తీర్చిదిద్దన పాఠశాల ఉపాధ్యాయుల టీం స్పిరిట్ ని / సమిష్టి ప్రతిభని అభినందించారు. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఇలా విద్యార్థులను ప్రోత్సహించేలాగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని, ఇటువంటి పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ పాఠశాలలో అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల కోసం ఎప్పుడూ వినూత్నరీతులలో పాఠాన్ని బోధించే ఉపాధ్యాయురాలు ఎన్. ఉమామహేశ్వరి ని దుశ్శాలువ తో సన్మానించారు. అనంతరం
మండల విద్యాశాఖ అధికారిణి ఎం.వి. నాగరత్నం మాట్లాడుతూ ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులు నలుగురూ కూడా చాలా చక్కగా పనిచేస్తారని,మండలంలో ఈ పాఠశాల అన్ని విషయాల్లోనూ ముందుంటుందని, విద్యార్థుల కోసం చాలా టి.ఎల్.ఎం ని తయారు చేసి పెట్టుకున్నారని కొనియాడారు.ఐటిసి సంస్థ నుండీ ఎమ్. ఎస్. కే. సురేష్ పాల్గొని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సొలస ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.వి. శ్రీనివాసరావు, ఎడ్లపాడు జడ్పిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు విజయభారతి, బోయపాలెం డైట్ నుంచి యోగేశ్వర్ ఇంకా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవి హేమలత, జి సతీష్ కుమార్, ఎన్ ఉమామహేశ్వరి, షేక్ షహనాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
