
పండుగ సాయన్న జయంతికి అధికారిక గుర్తింపు!
అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహణకు సీఎం హామీ
త్వరలోనే జీవో విడుదల
హైదరాబాద్, ముదిరాజుల ఆరాధ్య దైవం, వీరుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సచివాలయంలో సీఎంను కలిసిన పండుగ సాయన్న జయంతి–వర్ధంతి నిర్ధారణ కమిటీ
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి–వర్ధంతి నిర్ధారణ కమిటీ సభ్యులు కలిశారు.
ప్రముఖ న్యాయవాది, పుస్తక రచయిత బెక్కం జనార్ధన్, పరిశోధకుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల కృష్ణ ముదిరాజ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
చిరకాల ఆకాంక్షకు కీలక ముందడుగు
పండుగ సాయన్న చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి, పేదలు–బలహీన వర్గాల కోసం చేసిన సేవలను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సమాజం చాలాకాలంగా కోరుతున్న విషయాన్ని వివరించారు.
దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ, అక్టోబర్ 22న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు హామీ ఇవ్వడంతో పాటు త్వరలోనే జీవో విడుదల చేస్తామని స్పష్టం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జయంతి
ప్రభుత్వం జీవో విడుదల చేస్తే ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం ఏర్పడనుంది. పండుగ సాయన్న చరిత్ర, సామాజిక సేవ, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటిచెప్పే దిశగా ఇది చారిత్రక ముందడుగుగా ముదిరాజ్ సమాజ ప్రతినిధులు అభివర్ణించారు.
సంజీవ్ ముదిరాజ్ హర్షం
ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న ఆకాంక్షకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. పండుగ సాయన్న జయంతికి అధికారిక గుర్తింపు కల్పించే దిశగా సీఎం హామీ ఇవ్వడం ముదిరాజ్ సమాజానికి గర్వకారణమన్నారు.
“ముదిరాజుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ చారిత్రక ముందడుగు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి అధికారికంగా నిర్వహించేలా త్వరగా జీవో విడుదల చేయాలి” అని సంజీవ్ ముదిరాజ్ కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్‌కు ముదిరాజ్ సమాజం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“అక్టోబర్ 22 ఇక ముదిరాజ్ సమాజ చరిత్రలో మరుపురాని రోజు” మిగిలిపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు
