
పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు
ఎంపీడీఓలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమించే విధానం రద్దు
రాష్ట్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)ను నేరుగా నియమించే విధానం రద్దుకానుంది. అంతకంటే కిందిస్థాయి (ఫీడర్ క్యాడర్) ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, ఎంపీడీఓ ఖాళీలు భర్తీ చేయనున్నారు. మండలాల్లో ప్రస్తుత ఈవో పీఆర్డీలను ఇకపై డిప్యూటీ ఎంపీడీఓలుగా పరిగణిస్తారు. ఇందుకు సంబంధించిన సర్వీస్ నిబంధనలను సవరిస్తూ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఎంపీడీఓ, డివిజనల్ పంచాయతీ అధికారులను (డీఎల్పీఓ) ఒకే క్యాడర్ నిర్ధారించారు.
జడ్పీ సీఈవోలుగా ఐఏఎస్ లు
జడ్పీ సీఈఓ పోస్టుల్లో 50% వరకు ఐఏఎస్ అధికారులతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు అందుబాటులో లేనప్పుడు డివిజినల్ డెవలప్ మెంట్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ డిప్యూటీ సీఈఓలను నియమిస్తారు. మొత్తం పోస్టుల్లో మూడోవంతు వీరికి కేటాయించనున్నారు. వీరు కూడా తగినంతమంది లేనప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల అధి కారులను డిప్యుటేషన్ పై తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారుల క్యాడర్ ను అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచారు.
