Spread the love

వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్ష్ సురభి సూచించారు.

కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్పిసిసీహెచ్ – హీట్ వేవ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని, అత్యవసర పనులు ఉంటే మాత్రమే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఎండల తీవ్రతపై అప్రమత్తమై తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బయటకు వెళ్ళినప్పుడు తాగునీరు వెంట తీసుకెళ్లాలని, వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని సూచించారు. అదేవిధంగా, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆరు బయట పనిచేసే కార్మికులు ఎండల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ వేళల్లో బయటికి వెళ్లే సమయంలో కాటన్ దుస్తులు ధరించి, గొడుగు గాని టోపి గానీ పెట్టుకొని వెళ్లాలని సూచించారు.

ఎండ దెబ్బ తగిలిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగి వైద్య సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలు, శిశువులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రూపొందించిన “వడదెబ్బ నుండి రక్షించుకుందాం ” అనే గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, వివిధ జిల్లా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.