
22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలు, వైసీపీ ప్రభుత్వ రీసర్వే పాపాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది : మాజీమంత్రి ప్రత్తిపాటి.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిషేధిత జాబితా భూముల రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
- గత ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ప్రహాసనంగా మార్చి, రైతులకు తీవ్ర అన్యాయం చేసి, సొంత పార్టీవారికి మేలుచేసిందన్న ప్రత్తిపాటి
- దేవాదాయ శాఖ తప్పిదంతో దాదాపు 12 లక్షల ఎకరాల భూములు 22ఏ (1C) జాబితాలో నమోదయ్యాయి. : పుల్లారావు
- 2019లో టీడీపీ ప్రభుత్వం 22ఏ భూముల సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. : పుల్లారావు.
- వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో దాన్ని చట్టంగా మార్చకుండా, నిబంధనలకు విరుద్ధంగా రీసర్వే చేపట్టింది : పుల్లారావు.
గత ప్రభుత్వం భూరక్ష పేరుతో చేపట్టిన, భూముల రీసర్వ ప్రక్రియ మొత్తం ఒక ఫార్స్ గా మారిందని, అధికారపార్టీ నాయకులు దాన్ని దుర్వినియోగం చేశారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… సెంటు భూమి ఉన్నవారిని కూడా గత ప్రభుత్వం తన చేతగానితంతో తీవ్ర గందరగోళానికి గురిచేసిందన్నారు. 6,688 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపట్టిన గత ప్రభుత్వ నిర్వాకంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు గురయ్యారన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని, సరిహద్దులకు సంబంధించి భూ హక్కుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గత పాలకులు పరిగణనలోకి తీసుకోలేదని ప్రత్తిపాటి చెప్పారు. ఒక భూమిని రీసర్వే చేసేటప్పుడు హద్దుదారులకు నోటిసులు ఇస్తారని, కానీ గత ప్రభుత్వం అలాంటి నిబంధనలు పాటించలేదన్నారు. కేవలం తమ పార్టీ నాయకులు, సానుభూతిపరులకు మేలుచేసేలా రీసర్వే చేసిందన్నారు. తమ సమస్యలపై ఫిర్యాదులు.. అభ్యంతరాలు తెలియచేయడానికి, వాటి పరిష్కారానికి కూడా వైసీపీప్రభుత్వం తగిన వ్యవధి కూడా ఇవ్వలేదన్నారు. 60 రోజులు సమయం ఇవ్వాల్సి ఉండగా, 20రోజులకే కుదించి రైతుల అభిప్రాయాలను పెడచెవిన పెట్టిందన్నారు. కూటమిప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలపై గ్రామసభలు నిర్వహించగా, ప్రజల నుంచి లక్షా 80వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో, ఎంత అడ్డగోలుగా రీసర్వే చేపట్టిందో చెప్పడానికి వచ్చిన అర్జీలే నిదర్శనమన్నారు. కూటమిప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ పద్ధతిప్రకారం, పారదర్శకంగా జరగుతోందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, రాజకీయ ప్రాబల్యానికి తావులేకుండా రికార్డ్స్ ప్రకారం సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని, రెవెన్యూమంత్రిని కోరుతున్నానన్నారు.
22ఏ (1C) భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రజలకు తెలియాలి…
22ఏ (1C) జాబితాపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో,భూ హక్కుదారుల్లో తీవ్ర ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ అంశం గురించి 2019లో అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, దానిపై అప్పట్లో ఒక ఆర్డినెన్స్ కూడా చేయడం జరిగిందని, అంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పుల్లారావు తెలిపారు. పాదయాత్ర సమయంలో జగన్ 22ఏ పై ఎన్ని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమాయక రైతుల్ని మోసగించాడని పుల్లారావు చెప్పారు. టీడీపీప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై గత ప్రభుత్వం చట్టం చేయలేకపోయిందన్నారు. దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలన్నారు. దేవాదాయ శాఖ అధికారుల తప్పిదం (ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్) వల్ల దాదాపు 12 లక్షల ఎకరాల భూములు 22ఏ (1C) జాబితాలో నమోదయ్యాయన్నారు. దాంతో ఆ భూములకు బ్యాంకుల రుణాలు లభించక, రిజిస్ట్రేషన్లు జరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలా ప్రాంతాల్లో ఆ భూముల్లో ఇళ్లు కూడా వచ్చాయన్నారు. రాష్ట్రమంతా ఈ సమస్య పరిష్కారానికి ఎదురుచూస్తోందని మాజీమంత్రి తెలిపారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నామో, ఏ విదమైన చర్యలు తీసుకోబోతున్నామో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మంత్రి ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియడం అందరికీ మంచిదని పుల్లారావు అభిప్రాయపడ్డారు. మాజీమంత్రి ప్రత్తిపాటి లేవనెత్తిన ప్రశ్నకు కొనసాగింపుగా టీడీపీ ఎమ్మెల్యేలు కూనరవికుమార్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోనెల విజయ చంద్ర కూడా 22ఏ భూముల జాబితా, రీసర్వే సమస్యలను సభలో ప్రస్తావించారు.
