
25 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధికి చర్యలు…
★ ప్రతిపాదనలు కలెక్టర్ కు అందజేసిన ఎమ్మెల్యే…
★ శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తో భేటీ…
★ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్…
★ కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ…
- ఎమ్మెల్యే బలరామకృష్ణ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 25 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో అత్యవసరమైన పనుల ప్రతిపాదనల జాబితాను శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతికి అందజేశారు. పంచాయతీరాజ్ పరిధిలోగల గ్రామీణ రోడ్లలో.. అద్వానంగా ఉన్న వాటిని సిసి రోడ్లుగా అభివృద్ధి చేయడానికి అధికార యంత్రాంగంతో కలిసి తయారుచేసిన జాబితాపై ఎమ్మెల్యే కలెక్టర్ కు వివరించారు. ఈ ప్రతిపాదనను త్వరితగతిన ఆమోదించి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంబంధిత పనుల వివరాలను కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. సిసి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి అత్యవసరమైన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, పలు ప్రజా సమస్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు కూడా త్వరితగతిన మంజూరయ్యాలా చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.
అనంతరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు. ముఖ్యంగా.. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి సమస్యను నిర్దిష్టంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో గ్రామీణ రహదారులు అత్యంత దుర్భరంగా తయారయ్యాయన్నారు. ఎక్కడా సిసి రోడ్లు గాని, బీటీ రోడ్లు గాని నిర్మించిన పరిస్థితి లేదన్నారు. ఆఖరికి రైతులకు ఉపయోగపడే… పంట పొలాలకు వెళ్లే రహదారులపై గంపెడు గ్రావెల్ వేసిన పరిస్థితి కూడా లేదని విమర్శలు గుప్పించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుండి, ఒక్కొక్క సమస్య పైన దృష్టి సారిస్తూ.. వాటి పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రహదారులు వివిధ నిధులతో సిసి రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మరికొన్ని బీటీ రోడ్లు కూడా రెడీ అవుతున్నాయన్నారు. అత్యంత నాణ్యతగా, పారదర్శకతతో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ శాతం రహదారుల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అత్యవసర పనులను గుర్తించడం జరిగిందన్నారు. వీటన్నిటిని సిసి రోడ్లుగా అభివృద్ధి చేసే నిమిత్తం దాదాపు 25 కోట్ల అంచనాలతో ఒక ప్రణాళికను రూపొందించుకుని వాటిని అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే.. సంబంధిత శాఖ అధికారుల ద్వారా రూపొందించిన పనుల ప్రతిపాదనల జాబితాను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అందజేయడం జరిగిందన్నారు. ఆమె కూడా సంబంధిత పనులకు సంబంధించి సానుకూలంగా స్పందించారన్నారు. వీటికి సంబంధించిన పనులు మంజూరు కాగానే.. నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో సమస్యలు లేని నియోజకవర్గం గా రాజానగరాన్ని నిలబెట్టడమే తన తక్షణ కర్తవ్యం అన్నారు. ఈ దిశలోనే.. కూటమి నేతలు అందరితో కలిసి ముందడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ వెల్లడించారు.
