TEJA NEWS

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం..

4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. హేమంత్ సర్కార్ పదవీకాలం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని చారిత్రాత్మక మోర్హబడి మైదానంలో ప్రభుత్వం.. నాలుగేళ్ల విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం ముఖ్యమైన విధానాలు, విజయాలను ఈ సందర్భంగా ప్రకటించడంతోపాటు.. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుమారు రూ.5,000 కోట్ల విలువైన 300కు పైగా పథకాలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన 20కి పైగా పథకాలను ప్రారంభించారు.రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలకు నూతన సంవత్సర కానుకను సైతం ప్రకటించారు. రాష్ట్రంలోని ఆదివాసీ, దళితులకు 60 ఏళ్లగా ఉన్న పింఛను అర్హత వయస్సును 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇకపై రాష్ట్రంలోని కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్‌ చేసేలా చట్టం తీసుకొస్తామని హేమంత్ సోరేన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన 662 మంది ఉపాధ్యాయులకు, ఆరోగ్యశాఖలోని 307 మంది వైద్య సిబ్బందికి, ఇతరులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. దీనితోపాటు గత నాలుగు నెలల్లో జరిగిన పనుల వివరాలను కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఆప్కే ద్వార్ కార్యక్రమం.. ఈ కార్యక్రమంలో పరిపాలన సామాన్య ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో.. దీన్ని ఏర్పాటు చేశారు. దీని కింద ఇప్పటి వరకు రూ.3500 కోట్లు పంపిణీ చేశారు. 31 లక్షల మందికి.. ఆస్తుల పంపకం జరిగింది… దీంతో పాటు 12,475 పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

4 సంవత్సరాలలో హేమంత్ ప్రభుత్వం సాధించిన విజయాలలో సర్వజన్ పెన్షన్ స్కీమ్, అబువా ఆవాస్ యోజన, సోనా సోబ్రాన్ ధోతీ చీర పథకం, సావిత్రిబాయి ఫూలే కిషోరి సమృద్ధి యోజన, ఫూల్ ఝానో ఆశీర్వాద్ యోజన, గ్రీన్ రేషన్ కార్డ్, బిర్సా ఛీఫ్ విలేజ్ స్కీమ్, గ్రీన్ విలేజ్ పథకం గ్రామ యోజన, గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్, మారంగ్ గోమ్కే జైపాల్ సింగ్ ముండా పరదేశీయ స్కాలర్‌షిప్ పథకం, ముఖ్యమంత్రి సారథి పథకం, ముఖ్యమంత్రి ఉపాధి కల్పన పథకం వంటి అనేక విజయాలు గత నాలుగేళ్లలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం పేరిట ఉన్నాయి.

కాగా.. ఝార్ఖండ్‌ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్) కూటమిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


TEJA NEWS