
ట్రాఫిక్ క్రమశిక్షణ.. నగర క్రమశిక్షణకు ప్రతీక..- రోడ్డు ప్రమాదాల నివారణకు 100 శాతం సమన్వయంతో కృషిచేయాలి
స్వచ్ఛంద సంస్థలనూ కీలక భాగస్వాములను చేయాలి 139 బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి
ఫుట్ఓవర్ బ్రిడ్జ్, అండర్‌పాస్‌లపై ప్రతిపాదనలు రూపొందించాలి ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులపైనా దృష్టిపెట్టాలి
డీఆర్‌సీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
రాజధాని ప్రాంతానికి ముఖద్వారమైన విజయవాడను ట్రాఫిక్ పరంగా క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలో సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని, ట్రాఫిక్ క్రమశిక్షణ.. నగర క్రమశిక్షణకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు.
గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్‌సీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు.. వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, బ్లాక్ స్పాట్‌ల వద్ద తీసుకున్న చర్యలు, రహదారి భద్రత ఉల్లంఘనలపై చర్యలు, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ స్కీమ్-2022, ఐ-రాడ్ అమలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు తదితరాలపై చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుకల్పించే అస్త్రం-ASTram (యాక్సనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్) యాప్‌పైనా కమిటీలో చర్చించారు. 2024లో జిల్లాలో మొత్తం 1,343 రహదారి ప్రమాదాలు జరగ్గా.. 431 మరణాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. ఈ మరణాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాల వల్ల 212, రాష్ట్ర హైవేలపై ప్రమాదాల వల్ల 79, ఇతర రహదారులపై ప్రమాదాల వల్ల 140 సంభవించాయని వివరించారు.
సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ రవాణా, పోలీస్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, విజయవాడ నగరపాలక సంస్థ తదితర శాఖల అధికారులతో పాటు డీఆర్‌సీసీ ఇతర భాగస్వామ్య పక్షాలు పటిష్ట సమన్వయంతో పనిచేసి రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. స్వచ్ఛంధ సంస్థల అధ్యయన నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసి రహదారి ప్రమాదాలు జరక్కుండా పటిష్ట కార్యాచరణ అవసరమన్నారు. ఎన్‌హెచ్-16పై 17 బ్లాక్‌స్పాట్‌లు, ఎన్‌హెచ్-30పై 17, ఎన్‌హెచ్-65పై 49, ఎస్‌హెచ్-192పై 1, ఎస్‌హెచ్-236పై 3, ఎస్‌హెచ్-32పై 3, ఇతర రహదారులపై 49 మొత్తం 139 హాట్‌స్పాట్‌లను గుర్తించినందున, ఆయా ప్రాంతాల్లో ఒక్క ప్రమాదమూ జరక్కుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై దృష్టిపెట్టి మున్ముందు ప్రమాదాలు జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు వంటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, అండర్‌పాస్‌లపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులపైనా దృష్టిపెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రతినెలా తప్పనిసరిగా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ డేటాను సమగ్రంగా విశ్లేషిస్తున్నాం: సీపీ ఎస్‌వీ రాజశేఖర బాబు
జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు రియల్‌టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని.. ఆ ఫలితాల ఆధారంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. రహదారి ప్రమాదాలు, మరణాలను గణనీయంగా తగ్గించేందుకు సమష్టిగా కృషిచేస్తున్నామన్నారు. బెంజ్ సర్కిల్ వద్ద అనలిటిక్స్‌ను విశ్లేషించగా.. 84 శాతం మంది హెల్మెట్‌ను ధరించినట్లు వెల్లడైందని.. ఇదే స్ఫూర్తితో సురక్షిత ప్రయాణం దిశగా అడుగులేద్దామన్నారు. పబ్లిక్ సేఫ్టీ ప్రధానంగా ప్రతి చర్యా చేపడుతున్నట్లు తెలిపారు. పాదచారులు కూడా ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని.. ఈ నేపథ్యంలో ఇష్టానుసారం రోడ్డు క్రాస్ చేయకుండా వారు సురక్షితంగా రహదారి దాటేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దశల వారీగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని.. ట్రాఫిక్ పరిస్థితుల అధ్యయనానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఏ రూట్‌లో వెళ్తే ఏ ప్రాంతాలు వస్తాయనే విషయం స్పష్టంగా అర్థమయ్యేలా సూచికలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రహదారుల వెంబడి ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిస్టమాటిక్ పార్కింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు వెల్లడించారు.
సమావేశంలో డీసీపీలు గౌతమిశాలి, కేఎం మహేశ్వరరాజు, కేజీవీ సరిత, ఎం.కృష్ణమూర్తి నాయుడు,
డీటీసీ ఎ.మోహన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ టి.సత్యనారాయణ తదితరులతో పాటు వీఎంసీ, పోలీస్, ట్రాఫిక్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు
