TEJA NEWS

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవు

టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు హెచ్చరిక

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.

టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చెలామణి అవుతూ ఛైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ రాజు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చైర్మన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం: 18/2025తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా నకిలీ వెబ్ సైట్లను, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే దర్శనం, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.