
అమ్మో లేబర్ … లైసెన్స్ …
భయపడుతున్న చిరువ్యాపారులు
ఇక్కడ దరఖాస్తులు ఆన్‌లైన్ ..
అవినీతి ఆఫ్‌లైన్ ..
రేటు నిర్ధేశించి వసూలు చేస్తున్న సిబ్బంది
చిలకలూరిపేట : చిన్నపాటి దుకాణంలో ఏదైనా వ్యాపారం నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి అనేక అనుమతులు అవసమౌతాయి. వివిధ వ్యాపారాలు చేసేవారు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. తర్వాత కార్మిక శాఖ నుంచి లేబర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లేబర్ లైసెన్స్ జారీ చేసే సమయంలో అధికారులు, సంబంధిత సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిలకలూరిపేటలో సహాయ కార్మికశాఖాధికారి కార్యాలయం కార్యాలయం ఎక్కడ ఉందో..? ఆ కార్యాలయ ముఖ్య అధికారి ఎవరో సామాన్య ప్రజలకు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. కాని చిరువ్యాపారులు మాత్రం లేబర్ లైసెన్స్ పేరు వింటనే హడలిపోతున్నారు. కార్యాలయం ఎక్కడ ఉందో కనుక్కొని తమ సమస్యను తృణమో, పణమో చెల్లించుకొని బయట పడుతున్నారు.
అసలు ఇక్కడేం జరుగుతుందంటే…దరఖాస్తులు ఆన్‌లైన్ .. అవినీతి ఆఫ్‌లైన్
ప్రతి దుకాణం లేదా వాణిజ్య సంస్థ యజమాని తమ వ్యాపారాన్ని ప్రారంభించిన వెంటనే లేబర్ లైసెన్స్ పొందాలి. ఈ రిజిస్ట్రేషన్ ఉద్యోగ నిబంధనలు, గంటలు, వేతనాలు కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. రిటైల్ దుకాణాల నుండి సర్వీస్ ప్రొవైడర్లు మరియు గిడ్డంగులు వరకు వ్యాపారాన్ని నిర్వహించే ఎవరికైనా ఇది అవసరం. గతంలో కార్మిక శాఖ కార్యాలయాల నుంచి వీటిని పొందేవారు. అయితే కాలయాపన నివారణకు, అవినీతికి ఆస్కారం లేకుండా వీటిని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. సచివాలయాలు, మీ-సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపవచ్చు. వీటిని చిలకలూరిపేటలో ఉన్న సహాయ కార్మిక శాఖాధికారి పరిశీలించి లైసెన్సు అందజేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా అందిన వెంటనే కార్మికశాఖ సిబ్బంది ఫోన్లు చేయడం, లైసెన్స్ మంజూరు చేయాలంటే తాము సూచించిన విధంగా లంచంగా చెల్లించాలని డిమాండ్ చేస్తుండటంతో చిరువ్యాపారులు బిత్తర పోతున్నారు. తాము చేసేదే చిన్న వ్యాపారమని, వేలకు వేలు ఎక్కడి నుంచి చెల్లించాలని వాపోతున్నారు. కొందరైతే సహనం నశించి, డబ్బులు ఇవ్వం అని మొండి కేస్తుండటంతో వారిపై కార్యాలయ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం..అంటూ చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఈ కార్యాలయ సిబ్బంది అవినీతిపై కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడటానికి సిద్దమౌతున్నారు.
