అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా ఎస్‌ఐఆర్‌ నిర్వహణ…..

TEJA NEWS

అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా ఎస్‌ఐఆర్‌ నిర్వహణ…..

— కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 24 సంవత్సరాల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు.

అక్టోబర్ 1, 2026ను ప్రమాణిక తేదీగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కూడా ఈ ప్రక్రియలో భాగమని చెప్పారు.
ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. 2002 తర్వాత కొత్తగా చేర్చిన ఓటర్లు పాత ఓటర్లతో సంబంధాన్ని లేదా కొత్త నమోదు ఆధారాలను చూపించాలని సూచించారు.

ఒకవేళ ప్రస్తుత ఓటరు పేరు 2002 జాబితాలో లేకపోతే, వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు, ఈపిక్ నంబర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ దశలో ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ఓటరు పేరు తొలగించబడితే మళ్లీ అప్పీల్‌ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేయాల్సి వస్తుందని, అది సుదీర్ఘ ప్రక్రియ అవుతుందని తెలిపారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని పేర్కొన్నారు.

జూన్ మొదటి వారంలో మండల స్థాయిలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు ఎస్‌ఐఆర్‌లో పాల్గొనే బీఎల్‌వోలు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాలో లేని ప్రతి ఒక్కరూ తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, సరైన పత్రాలతో ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

జూలై 31, 2026న డ్రాఫ్ట్ ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలని సూచించారు.
డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం పుట్టిన సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
జూలై 1, 1987కు ముందు భారతదేశంలో జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు.

జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తండ్రి లేదా తల్లి ఎవరి అయినా ఒకరి జనన లేదా గుర్తింపు పత్రం సమర్పించాలని తెలిపారు.

డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తండ్రి, తల్లి ఇద్దరి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
సెప్టెంబర్ 28, 2026 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్ 1, 2026న తుది ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.

జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన బీఎల్‌వో ఎవరో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని చెప్పారు. ఓటర్లు voter.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top