తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏకదీక్షతో పోరాడిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏకదీక్షతో పోరాడిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్


వనపర్తి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సిపిఐ జాతీయ రాష్ట్ర పార్టీలు పోరాడాయని, ప్రత్యేక తెలంగాణలో అమరుల ఆశయ సాధనకు అవసరమైతే మరో పోరాటం చేయాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తి ఆఫీస్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కళావతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. నిజాం నుంచి తెలంగాణ ప్రజల విముక్తికి సిపిఐ పోరాడి విజయం సాధించింది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని ఉద్యమాలు చేసిందన్నారు. అయినా ఫలితం రాకపోవడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి సాధ్యమని భావించిందన్నారు‌.నీళ్లు నిధులు నియామకాల పట్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవడంపై సిపిఐ చలించిందన్నారు‌.

ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని సిపిఐ జాతీయ కమిటీ తీర్మానించిందని, ఆంధ్ర రాయలసీమ ప్రాంత సిపిఐ, అనుబంధ సంఘాల నేతలు మద్దతు పలికారు అన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అమరుల ఆశయాలు నీళ్లు నిధులు నియామకాలు సాధించకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటంతో తెలంగాణ ప్రజలు దానికి బుద్ధి చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ పట్టం కట్టారన్నారు. రెండున్నర ఏండ్లు గడిచిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు,అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు, కాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల హామీలు అమలయ్యేదాకా, అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేదాకా సిపిఐ పోరాడుతుందని ప్రజలు అండగా నిలవాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, నేతలు చిన్న కుర్మయ్య లక్ష్మీనారాయణ శేఖర్ వంశీ ఎర్ర కురుమయ్య శిరీష రూప తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top