డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్…

TEJA NEWS

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్…

గంజాయి మత్తుకు గుడ్‌బై చెప్పండి, లేకపోతే జైలుకే… సీపీ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం మంచిర్యాల:గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేని పక్షంలో కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి సీపీ సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు మత్తు పదార్థాలకు బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న చికిత్సా విధానాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీపీ, 15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు. గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని వైద్య సిబ్బందితో పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని సీపీ స్పష్టం చేశారు. గంజాయి విక్రేతలు, మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు.

డ్రగ్స్ రహిత కమిషనరేట్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top