
పర్యావరణ పరిరక్షణకు ఎన్టీపీసీ కట్టుబాటు….
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ రామగుండం & తెలంగాణ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ, ఎన్టీపీసీ రామగుండం & తెలంగాణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు, జీఈఎం పిల్లలు, కాంట్రాక్ట్ కార్మికుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను సంస్థ మరోసారి చాటిచెప్పింది.
ఈ వేడుకలు పర్యావరణ అవగాహన ర్యాలీ (ప్రభాత ఫేరీ)తో ప్రారంభమయ్యాయి. ఈ ర్యాలీకి ఎన్టీపీసీ రామగుండం & తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానం, ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యతను ప్రజల్లో చాటిచెప్పడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.
అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞను అందరికీ చేయించారు. ప్రకృతి పరిరక్షణ, వనరుల బాధ్యతాయుత వినియోగం కోసం కట్టుబడి పనిచేస్తామని పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలనే ప్రపంచ లక్ష్యానికి అనుగుణంగా స్థానిక వ్యాపారులకు వస్త్ర సంచులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన జీఈఎం పిల్లల చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా టౌన్షిప్లో భారీ స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు, జీఈఎం పిల్లల భాగస్వామ్యంతో 200 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే కాక జీవ వైవిధ్య సంరక్షణకు తమ కట్టుబాటును చాటారు.
అలాగే తెలంగాణ సీహెచ్పీ కోల్ భవన్లో మరో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులు, సీహెచ్పీ తెలంగాణ కార్మికుల భాగస్వామ్యంతో 100 మొక్కలను నాటారు.
పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ యాష్ డైక్ వద్ద మియావాకి విధానంలో ప్రత్యేక వన సంరక్షణ కార్యక్రమాన్ని చందన్ కుమార్ సమంత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఎఫ్డీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. మియావాకి పద్ధతిలో 1,000 మొక్కలను నాటడం ద్వారా సాంద్రతతో కూడిన స్వయం సమృద్ధి అడవుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మొత్తం 1,300 మొక్కలను వివిధ ప్రాంతాల్లో నాటడం జరిగింది. పచ్చని, పరిశుభ్రమైన, సుస్థిర భవిష్యత్తు నిర్మాణంలో ఎన్టీపీసీ రామగుండం & తెలంగాణ తమ అంకితభావాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని అందిస్తూ, భావితరాల కోసం ప్రకృతిని కాపాడాలని ఎన్టీపీసీ సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.