
నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, . నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని ఆయన మండిపడ్డారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. ఒకసారి పరీక్ష రద్దు కావడంతో మళ్లీ నెలల తరబడి కష్టపడి సిద్ధమైన విద్యార్థులను కేవలం ఐదు లేదా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో పరీక్షకు అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం, మరోవైపు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద కన్నీటి పర్యంతమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన ప్రభుత్వానికి శాపంగా మారుతుందని గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు. యువత ఆశయాలను గౌరవించి, వారి భవిష్యత్తును కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“పిల్లల భవిష్యత్తు కోసం పని చేయండి.. వారి జీవితాలతో ఆడుకోవద్దు” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
