రాష్ట్రంలో పూరిగుడిసెలు కాకుండా ప్రతి కుటుంబానికి పక్కా భవనం కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

TEJA NEWS

రాష్ట్రంలో పూరిగుడిసెలు కాకుండా ప్రతి కుటుంబానికి పక్కా భవనం కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
పూరి గుడిసెలు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం

బేస్‌మెంట్ కట్టుకొని ఉన్న, గోడలు మంచిగా ఉండి పై కప్పు రేకులు, కవెలలు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

వనపర్తి జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రత్యేక అధికారి సమీక్ష

జిల్లాలో ప్రజాపాలన అమలు చేసిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రత్యేక అధికారి……….. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వీపీ గౌతమ్

వనపర్తి
రాష్ట్రంలో పూరి గుడిసెలు కాకుండా ప్రతి కుటుంబానికి పక్కా భవనం కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పూరి గుడిసెలు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ సోమవారం వనపర్తి జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాలు, “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమాలు, ఆరోగ్య వారోత్సవాలు, టీబీ మిషన్, తదితర అంశాలపై వివరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమం ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు.

విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గ్యాస్ కనెక్షన్ల వినియోగాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. పంటల మార్పిడి అంశంపై మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

సాదాబైనామా దరఖాస్తులపై సమీక్ష నిర్వహించిన ఆయన, రెవెన్యూ అధికారులు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా వాటిని వెరిఫై చేయడం తప్పనిసరి అని సూచించారు. అలాగే గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ పథకాల అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిపై ఆరా తీసిన ప్రత్యేక అధికారి, మంజూరైన, గ్రౌండింగ్ జరిగిన, పూర్తయిన ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో మొత్తం 5,982 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 5,173 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తైందని, 1,300 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అత్యంత పేద కుటుంబాలకు, ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే నిబంధనల ప్రకారం ఇళ్లను కేటాయించాలని ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు. పథకం ప్రధాన లక్ష్యం నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమేనని పేర్కొన్నారు. అలాగే తదుపరి విడతలో బేస్‌మెంట్ స్థాయి, పైకప్పు స్థాయి వరకు నిర్మాణం చేపట్టిన వారికి కూడా ఇళ్ల మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ అప్పుల దారుల బారిన పడకుండా లబ్ధిదారులను అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా అవసరానికి మించి ఎత్తైన బేస్‌మెంట్లు, అధిక వ్యయంతో కూడిన నిర్మాణాలు చేపట్టవద్దని లబ్ధిదారులకు సూచించాలని, అలాంటి నిర్మాణాలు అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ప్రత్యేక అధికారి తిలకించి, సంతృప్తి వ్యక్తం చేశారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top