
99 రోజుల విజయగాథలను ఆదర్శ గ్రంథంగా మలచాలి….
పెద్దపల్లి జిల్లాకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రశంసలు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆకర్షణీయమైన పుస్తకంగా రూపొందించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా పొందుపరిచే నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి జిల్లాలో 99 రోజుల కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, జిల్లాలో అమలైన వినూత్న కార్యక్రమాలు, విజయగాథలు, ప్రజలకు ఉపయోగపడిన ఉత్తమ విధానాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి అందిన వినతులు, పరిష్కరించిన సమస్యలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా డాక్యుమెంట్ చేయాలని సూచించారు.
గ్రామాల్లో తాగునీటి సమస్యలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, గ్రామీణ రహదారుల మరమ్మతులు, వృద్ధాప్య పింఛన్ల పంపిణీ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు, ప్రత్యేక కార్యక్రమాల క్లిప్పింగ్స్‌ను భద్రపరచి పుస్తకంలో పొందుపరచాలని సూచించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మార్చి నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యాశాఖలో సీఎచ్ఎం స్కూల్ విజిట్స్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం, విద్యార్థుల విద్యా ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు, 340 సమ్మర్ క్యాంపుల ద్వారా 3,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లు వివరించారు.
పోషణ కార్యక్రమాల ద్వారా తీవ్ర పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందని, వందలాది అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు రూ.1,057 కోట్ల చెల్లింపులు జరిపినట్లు, డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా వేలాది నీటి కనెక్షన్లను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, అక్షరాస్యత, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, మెగా జాబ్ మేళాలు, ఆరోగ్య శిబిరాలు, యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో జిల్లా విశేష ఫలితాలు సాధించిందని వివరించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె. అరుణశ్రీ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. నీటి కనెక్షన్ల డిజిటలైజేషన్, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల్లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
