
అర్హులైన సీనియర్ మైనింగ్ సర్దార్‌లకు వెంటనే ఓవర్‌మెన్ ప్రమోషన్లు ఇవ్వాలి….
ప్రమోషన్లు కల్పించే వరకు ఓవర్‌మెన్ విధులు అప్పగించొద్దు ఆర్జీ-1 జీఎంకు ఏఐటీయూసీ వినతి…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, కేడర్ స్కీమ్ ప్రకారం అర్హత సాధించిన సీనియర్ మైనింగ్ సర్దార్ (ఓఎంహెచ్)లకు తక్షణమే ఓవర్‌మెన్ గ్రేడ్-బి ప్రమోషన్లు కల్పించాలని, అప్పటి వరకు వారికి వారి హోదాకు సంబంధించిన విధులనే అప్పగించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి నాయకులు సోమవారం ఆర్జీ-1 జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ, 2016, 2017 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ మైనింగ్ సర్దార్‌లు కేడర్ స్కీమ్ ప్రకారం మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఓవర్‌మెన్ గ్రేడ్-బి హోదాకు అర్హులైనప్పటికీ, “ఓవర్‌మెన్ ఖాళీలు లేవు” అనే కారణంతో యాజమాన్యం ప్రమోషన్లను అనవసరంగా నిలిపివేసిందని ఆరోపించారు.
ప్రమోషన్లు ఇవ్వకుండానే సీనియర్ మైనింగ్ సర్దార్‌లతో ఓవర్‌మెన్ విధులు నిరంతరం నిర్వహింపజేస్తున్నారని, దీనివల్ల సంస్థలో వాస్తవ ఖాళీలు కనిపించకుండా కృత్రిమంగా తగ్గించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో అర్హులైన ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు దాదాపు మూడేళ్లుగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ఈ పరిస్థితి కేడర్ స్కీమ్ ఉద్దేశ్యానికి, ఉద్యోగుల న్యాయమైన హక్కులకు విరుద్ధమని పేర్కొన్న ఆయన, అర్హులైన సీనియర్ మైనింగ్ సర్దార్‌లందరికీ తక్షణమే ఓవర్‌మెన్ గ్రేడ్-బి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమోషన్లు ఇచ్చే వరకు సీనియర్ సర్దార్‌లకు ఓవర్‌మెన్ విధులు అప్పగించరాదని స్పష్టం చేశారు.
సంస్థలో ఖాళీగా ఉన్న ఓవర్‌మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేనిపక్షంలో జూలై 22 తొలి షిఫ్ట్ నుంచి కంపెనీ జారీ చేసిన ఆఫీస్ ఆర్డర్ ప్రకారం సీనియర్ మైనింగ్ సర్దార్‌లు తమ హోదాకు సంబంధించిన మైనింగ్ సర్దార్ విధులు మాత్రమే నిర్వహిస్తారని హెచ్చరించారు. యాజమాన్యం వెంటనే స్పందించి మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ మాదన మహేష్, సిద్ధమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, గండి ప్రసాద్, పిట్ కార్యదర్శులు ఇజ్దగిరి రాజు, మైనింగ్ స్టాఫ్ నాయకులు పెర్క మహేందర్, శ్రీనివాస్, నాయకులు గొడిశెల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
