వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలి….

TEJA NEWS

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలి….

ఎన్‌పీడీసీఎల్ అధికారులతో సమీక్ష.. పెండింగ్ సమస్యల పరిష్కారం, విద్యుత్ స్తంభాల తరలింపుపై ఆదేశాలు….

–మేయర్ మహంకాళి స్వామి….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు.

తన ఛాంబర్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏడీఈగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గుండు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సమావేశంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించిన మేయర్, రోడ్ల విస్తరణకు ఆటంకంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తక్షణమే తరలించాలని ఆదేశించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి న్యూ అశోక థియేటర్ వైపు విద్యుత్ స్తంభాల తరలింపునకు డిమాండ్ నోట్ సమర్పించాలని సూచించారు.

ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసేందుకు నగరపాలక సంస్థ చెల్లించిన రూ.17.61 లక్షలకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని కోరారు. శాలపల్లి రోడ్డులో సోలార్ ప్లాంట్ సమీపంలో చెట్ల కొమ్మల కారణంగా విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని అధికారులు వివరించగా, మేయర్ వెంటనే స్పందించి చెట్ల కొమ్మల తొలగింపుపై ఎన్‌టీపీసీ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణమే స్పందించాలని, కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ డివిజన్‌లలో తలెత్తే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేయర్ సూచించారు.

ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ అధికారులు వంశీ, జమీల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

సమీక్ష అనంతరం మేయర్ నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలుగో డివిజన్ ఉదయ్‌నగర్, పవర్‌హౌస్ కాలనీల్లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గోదావరిఖని బస్‌స్టాండ్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.

అలాగే సప్తగిరి కాలనీలోని జ్యోతిబా బీసీ సంక్షేమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద కాలువను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రామగుండం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ స్తంభాల తరలింపు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఏఈ మీర్, టీపీఎస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top