
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి వేగం…
గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలో కొనసాగుతున్న విద్యాసంస్థలు, ఆసుపత్రుల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. మంథని 50 పడకల ఆసుపత్రి, గుంజపాడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రామగుండం నర్సింగ్ కళాశాల, వైద్య కళాశాల హాస్టల్, పెద్దపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు, పీఎం శ్రీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, ఇతర మౌలిక వసతుల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో టీఎస్‌ఎంఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ఏఈలు, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.