
గూడెం విద్యార్థులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేయూత..
స్కూల్ బ్యాగుల పంపిణీ, బెంచీల ఏర్పాటు హామీ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: మంచిర్యాల,
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాత కాకా వెంకటస్వామి ఈ ట్రస్ట్‌ను స్థాపించారని గుర్తు చేశారు.
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే పాఠశాలకు అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని, ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ…
స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన, అలాంటి విషయాలను తాను పట్టించుకోనని, ప్రజల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.