వేతనాల పెంపు కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మెకు సిద్ధం కావాలి….

TEJA NEWS

వేతనాల పెంపు కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మెకు సిద్ధం కావాలి….

హై పవర్ కమిటీ వేతనాలు వెంటనే అమలు చేయాలి: పీఎస్‌సీడబ్ల్యూయూ–టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్…..

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని
ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ప్రాంత ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ పాల్గొని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో ఒక్క పైసా కూడా పెంపు జరగలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు.

2013 నుంచి అమలు చేయాల్సిన హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ అమలు చేయలేదని, గతంలో 18 రోజుల సమ్మె అనంతరం కుదిరిన ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయ నాయకులు సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక హామీలు ఇస్తున్నప్పటికీ, 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు.

ఈ పరిస్థితుల్లో పోరాటమే ఏకైక మార్గమని, సింగరేణిలోని అన్ని డివిజన్లు, అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా వేతనాల పెంపు కోసం సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నాయకులు ఎర్రల సారయ్య, నీలం మదనమ్మ, అంజయ్య, సీహెచ్ ప్రమీల, మనుబోతుల స్వప్న, ఏ. మహేష్, రాజేశ్వరి, తిరుమల, శంకర్, లత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top