
తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే విద్యార్థుల విజయాలు…..
ఆరు నెలల్లో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి ,
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట ఎంపీపీ ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తుర్కల మద్దికుంట ఎంపీపీ ఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల పనులన్నింటినీ రానున్న ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
మౌలిక వసతులతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్న కలెక్టర్, ప్రతి తల్లిదండ్రి పేరెంట్–టీచర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ పిల్లల చదువు, ప్రగతి గురించి ఉపాధ్యాయులను తెలుసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, అనివార్య కారణాలతో గైర్హాజరైతే వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కొంత సమయం గడుపుతూ వారు నేర్చుకున్న పాఠాలు, హోంవర్క్ గురించి తెలుసుకుని ప్రతిరోజూ హోంవర్క్ పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
తల్లిదండ్రులు ఎప్పుడైనా పాఠశాలకు వచ్చి తమ పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన గురించి ఉపాధ్యాయులను సంప్రదించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావడంతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, జీసీడీఓ కవిత, సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు మంజులత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.