ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలి…

TEJA NEWS

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలి…

పెండింగ్ నిధుల వివరాలు వెంటనే సమర్పించాలి….

— ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణ శ్రీతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. అలాగే గురుకులాలు, సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారానికి సంబంధించిన 50 శాతం నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓవర్సీస్ విద్యా పథకం, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం, గురుకుల విద్యాసంస్థలకు సంబంధించిన పెండింగ్ నిధుల పూర్తి వివరాలను వెంటనే కమిషన్‌కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశంలో మిగిలిన పెండింగ్ నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.

జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా పూర్తి సామర్థ్యంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఉపాధి కల్పనలో రిజర్వేషన్ నిబంధనలను పారదర్శకంగా అమలు చేసి అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేసి సత్వర విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో చట్టంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కమిషన్ సూచించిన మేరకు పెండింగ్ నిధుల పూర్తి వివరాలను నిర్ణీత సమయంలో సమర్పిస్తామని, విద్య, ఉపాధి, సంక్షేమం, గురుకుల విద్యాసంస్థల బలోపేతానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిళ్లా శంకర్, రేణికుంట ప్రవీణ్, ఆర్డీవోలు బి. గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, ఏసీపీ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top