Spread the love

ప్రతి స్కామ్‌పై విచారణ జరిపిస్తాం, తప్పు చేసిన వారిని వదిలిపెట్టం-

వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్

అమరావతి/ ఎల్లో సింగం : 2019-24 మధ్య వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాగా, 2014-19 మధ్య కాలంలో జరిగిన పరిణామాలపై సభలో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. నిర్ణీత (19-24) కాలానికి సంబంధించిన పరిణామాలపైనే మాట్లాడాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

2014-19 మధ్య జరిగిన అవినీతి అక్రమాలపైనా సభలో చర్చ జరపాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పరస్పర మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై టీడీపీ సభ్యులు, మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చౌకబారుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. సొంత రాష్ట్రం నుంచి పాలన చేసేందుకే ప్రభుత్వం ఇక్కడికి వచ్చిందన్నారు. ”ఎమ్మెల్సీల కొనుగోలు స్కామ్ కేసులో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు లేదని తేల్చారు. 19-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసులో మీరు ఏదైనా చేసి ఉండొచ్చు కదా? గత ఐదేళ్లలో ప్రకృతి ఇచ్చిన పంచభూతాలను దోచుకుని స్కామ్ లు చేశారు.

యువత పోరుకు మేము ఎక్కడా అడ్డు చెప్పలేదు. గత ఐదేళ్లలో మేము నిరసనకు పిలుపునిస్తే మా ఇళ్లకు తాళాలు వేసి అడుగు బయటపెట్టనీయలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రతి స్కామ్ పై తప్పకుండా విచారణ జరుగుతుంది. తప్పు చేసిన వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదు. గత ఎన్నికల్లో మా విధానం మూడు రాజధానులంటూ ఎన్నికలకు వెళ్లింది వైసీపీ.

కర్ర కాల్చి వాత పెట్టినా సిగ్గు లేకుండా మాట్లాడటం సిగ్గనిపించడం లేదా? స్కిల్ కేసులో సుప్రీంకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చింది. ఐదేళ్లలో జరిగిన ప్రతి కుంభకోణంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

”అన్ని అంశాలపైన సిట్ విచారణ జరుపుతాము. 2019-24లో 32 డిపార్ట్ మెంట్లలో జరగని స్కామ్ అంటూ ఏదీ లేదు. ఇసుక, మైన్స్, పీడీఎస్ లో కోట్లు తిన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన గత పాలకుడు ఇష్టానుసారం దోచుకున్నాడు” అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.