
అధికారుల నిర్లక్ష్యమా….? నాపై కక్ష సాధింపా….?
1వ.డివిజన్ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న అధికారులపై కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్ ఆగ్రహం….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,రామగుండం/ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1వ. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, తన డివిజన్ అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే అనుమానం కలుగుతోందని 1వ.డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీకే రామయ్య కాలనీ, ఆటోనగర్‌కు వెళ్లే మార్గంలో గుట్టపై నుంచి వచ్చే వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రూ.25 లక్షల నిధులతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణానికి టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారని చెప్పారు.
అయితే డ్రైనేజీ నిర్మాణ సమయంలోనే రోడ్డు క్రాసింగ్ వద్ద పైపులు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టంగా సూచించినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో జేసీబీతో ఆటోనగర్‌కు వెళ్లే మట్టి రోడ్డును తవ్వి వరద నీటిని డ్రైనేజీలోకి మళ్లించాల్సి వచ్చిందన్నారు.
రోడ్డు తవ్వడంతో గత వారం రోజులుగా ఆటోనగర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తవ్విన రోడ్డులో వెంటనే పైపులు వేసి, మట్టితో పూడ్చి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కోరినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విజయ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదేశాలు ఉన్నా.. పనులు ఎందుకు నిలిచిపోయాయి….?
ఇందిరమ్మ కాలనీ హనుమాన్ గుడి వెనుక భాగంలో 160 మీటర్ల మేర మెయిన్ రోడ్డు పనులు చేపట్టగా, ఇంకా 60 మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. మిగిలిన రోడ్డు పనులను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ ఆదేశించినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకుండా పనులను నిలిపివేశారని ఆరోపించారు.
అలాగే మేడిపల్లిలో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశించినప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారో చెప్పాలని కార్పొరేటర్ ప్రశ్నించారు.
కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు
1వ.డివిజన్‌లో అభివృద్ధి పనుల పట్ల అధికారుల వైఖరిపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు విజయ మల్లేష్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆటోనగర్ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
“ప్రజల సమస్యల పరిష్కారానికి అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోను. అభివృద్ధి పనులు పూర్తి అయ్యే వరకు ప్రజల తరఫున పోరాడుతాను” అని కార్పొరేటర్ విజయ మల్లేష్ స్పష్టం చేశారు.